cinemavinodam

భారత్-కివీస్‌ల మధ్య హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది

5:28 AM Posted In Edit This

భారత్-కివీస్‌ల మధ్య హైదరాబాద్‌లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. స్వల్ప ఓవర్లలో కివీస్ నిర్దేశించిన 326 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. సెహ్వాగ్ 54, గంభీర్ 14 పరుగులతో అజేయంగా నిలిచారు.

కానీ ఫలితం తేలే అవకాశాలు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు. దీంతో అహ్మదాబాద్ టెస్టు తరహాలోనే హైదరాబాద్ రెండో టెస్టు కూడా గెలుపోటములు లేకుండా డ్రాగా ముగిసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (54) 54 బంతుల్లో ఆరు బౌండరీలు, ఒక సిక్సర్‌తో సూపర్ అర్థసెంచరీని తన టెస్టు ఖాతాలో వేసుకున్నాడు. మరో ఓపెనర్ గౌతం గంభీర్ కూడా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు కివీస్ తన రెండో ఇన్నింగ్స్‌ను 448/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ 350 పరుగులు చేయగా, భారత్ 472 పరుగులు చేసింది. ఈ టెస్ట్‌లో భారత ఆటగాడు హర్భజన్, కివీస్ ఆటగాడు మెక్వింతోష్‌లు సెంచరీలు సాధించారు. డబుల్ సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఓపెనర్ మెక్‌కల్లమ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. స్థానిక ఆటగాళ్లు వీవీఎస్ లక్ష్మణ్, ఓజాలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నగదు బహుమతులు ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ మాట్లాడుతూ.. "జహీర్ ఖాన్ గాయంతో తప్పుకున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ భుజానికి గాయం తీవ్రత తక్కువగా ఉండటంతో అతనిని బౌలింగ్‌కు ఉపయోగించుకోలేక పోయాం. కానీ సురేష్ రైనాను బౌలింగ్‌కు ఉపయోగించుకున్నాం. భజ్జీ బ్యాటింగ్ మంచి పరిణామమే.. అయితే అతనిపై ఆల్‌రౌండర్ కావాలని ఒత్తిడి తేవట్లేదు. నాగ్‌పూర్ టెస్టులో పిచ్ మాకు అనుకూలిస్తుందని నమ్ముతున్నాం." అని ధోనీ అన్నాడు.

కివీస్ కెప్టెన్ వెట్టోరి మాట్లాడుతూ.. డబుల్ సెంచరీ సాధించిన మెక్‌కల్లమ్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. భారత గడ్డపై రెండో ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ సాధించడం చిన్న విషయం కాదన్నాడు.